లక్నో: ఒక వ్యక్తి ఏకంగా అద్దె ఇంట్లో నకిలీ రాయబార కార్యాలయం (Fake embassy ) నిర్వహిస్తున్నాడు. లగ్జరీ, ఫ్యాన్సీ దౌత్య కార్లతో రాయబారిగా బిల్డప్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి విలాసవంతమైన రెండంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. అమెరికా నేవీ అధికారి స్థాపించిన ఏ దేశం గుర్తించని ‘వెస్టార్కిటికా’ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. తనను తాను రాయబారిగా అందరితో పరిచయం చేసుకున్నాడు. దౌత్య నంబర్ ప్లేట్లు ఉన్న ఖరీదైన కార్లలో ప్రయాణించాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు వినియోగిస్తూ ఆదరణ పొందుతున్నాడు.
కాగా, జూలై 22న ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు ఈ నకిలీ రాయబార కార్యాలయం గురించి తెలిసింది. దీంతో ఆ భవనంపై రైడ్ చేశారు. హర్షవర్ధన్ జైన్‌ను అరెస్ట్ చేశారు. దౌత్య నంబర్ ప్లేట్లు ఉన్న నాలుగు లగ్జరీ కార్లు, 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్‌పోర్ట్‌లు, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టాంపులున్న పత్రాలు, 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, 18 దౌత్య నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. హర్షవర్ధన్ జైన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Westarctica Office
మరోవైపు విదేశాల్లో పని పేరుతో జాబ్ రాకెట్టును హర్షవర్ధన్ జైన్ నడుపుతున్నాడని, మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లోనూ అతడు భాగమని పోలీసులు ఆరోపించారు. చట్టవిరుద్ధంగా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నందుకు 2011లో అతడిపై కేసు నమోదైందని పోలీస్ అధికారి తెలిపారు. నకిలీ రాయబార కార్యాలయం ఏర్పాటు ద్వారా అతడు పాల్పడుతున్న కార్యకలాపాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, అమెరికా నేవీ అధికారి ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో ‘వెస్టార్కిటికా’ను స్థాపించాడు. అంటార్కిటికా ఒప్పంద వ్యవస్థలో లొసుగుల ఆధారంగా 6,20,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. తనను తాను గ్రాండ్ డ్యూక్‌గా నియమించుకున్నాడు. వెస్టార్కిటికాలో 2,356 మంది పౌరులు ఉన్నట్లు అధికారికంగా పేర్కొన్నాడు. అయితే వాస్తవానికి అక్కడ ఎవరూ నివసించరు. ‘వెస్టార్కిటికా’ను ఏ దేశం కూడా గుర్తించలేదు. ఇలాంటి గుర్తింపులేని చిన్న దేశాలు (మైక్రోనేషన్స్) ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉన్నాయి.
Also Read:
Watch: సరదాగా కారు నడిపిన పిల్లలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భారీ వర్షాలు, వరదలకు రోడ్డుపైకి కొట్టుకొచ్చిన చేపలు.. తర్వాత ఏం జరిగిందంటే?