ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేయలేని పనిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. (Raj, Uddhav Thackeray reunion) 20 ఏళ్ల కిందట విడిపోయిన ఉద్ధవ్, తనను కలిపేందుకు ఫడ్నవీస్ పని చేశారని ఎద్దేశా చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తమ ఇద్దరిని కలిపిందన్నారు. 20 ఏళ్లుగా రాజకీయ వైరం ఉన్న సోదరులైన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే శనివారం కలిసిపోయారు. ముంబైలోని వర్లిలో జరిగిన ‘మరాఠీ స్వరం’ విజయోత్సవ సభలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు.
కాగా, బాలాసాహెబ్ చేయలేనిది ఫడ్నవీస్ చేశారని ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే అన్నారు. ‘రాజకీయాలు, పోరాటాలు కంటే మహారాష్ట్ర పెద్దది. 20 సంవత్సరాల తర్వాత నేడు ఉద్ధవ్, నేను కలిసి వచ్చాం. బాలాసాహెబ్ చేయలేనిది దేవేంద్ర ఫడ్నవీస్ చేసాడు. మా ఇద్దరినీ ఒకచోట చేర్చాడు’ అని అన్నారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళికలో భాగంగానే మూడు భాషల సూత్రాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు తాము కలిసి ఉండేందుకే కలిసి వచ్చామని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలతో సహా ముంబై పౌర సంస్థ ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన అన్నారు. అయితే ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కలయికతో మహారాష్ట్ర రాజకీయాలు మలుపుతిరుగుతాయన్న చర్చ జరుగుతున్నది.
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. మూడు జిల్లాల్లో అలెర్ట్
Watch: తనను చూసి మొరుగుతున్నదని.. కుక్కపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ కాల్పులు