న్యూఢిల్లీ, జూలై 9: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మే మధ్య అమెరికా ఎఫ్-1 వీసాల జారీ 27 శాతం పడిపోయింది. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 ఎఫ్-1 వీసాలు జారీ అయినట్లు అమెరికా విదేశాంగ శాఖ నుంచి లభ్యమైన డాటా తెలియచేస్తోంది. గత ఏడాది ఇది 13,478 ఉండగా, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత 2022లో సైతం 10,894 ఎఫ్-1 వీసాలు జారీ అయ్యాయి. ఎఫ్-1 వీసా జారీలు తగ్గిపోవడం విద్యార్థులు, విద్యా సంబంధ కన్సల్టెంట్లతోపాటు ఇరు దేశాలకు చెందిన విద్యా సంస్థలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా మార్చి నుంచి జూలై మధ్య కాలం అత్యంత కీలకమైన వీసా సీజన్. మొదటి సెమిస్టర్లో చేరే విద్యార్థులు ఈ సీజన్లోనే అమెరికా వెళతారు. ఈ సీజన్లో ఎఫ్-1 వీసాలు తగ్గిపోవడం అమెరికా విద్య పట్ల భారతీయ విద్యార్థుల అనాసక్తిని సూచిస్తున్నది.
ఎందుకు తగ్గాయి?
ఎఫ్-1 స్టూడెంట్ వీసాల సంఖ్య తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాలనాపరమైన జాప్యం ఏర్పడడం, దరఖాస్తుల స్క్రూటినీ తీవ్రతరం కావడం, మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేయడం, సోషల్ మీడియా ఖాతాలతోపాటు విద్యార్థుల నేపథ్యాన్ని లోతుగా పరిశీలించడం వల్ల ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ నిలిచిపోవడం వంటివి అనేక కారణాలు ఉన్నాయి. స్క్రీనింగ్ ప్రక్రియ సులభతరంగా ఉండేందుకు వీలుగా విద్యార్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని పబ్లిక్ చేయాలని న్యూఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ ఇప్పటికే సూచనలు జారీచేసింది. దీన్ని జాతీయ భద్రతా చర్యగా అమెరికా ప్రకటించినప్పటికీ అమెరికా వెళ్లాలన్న ఆసక్తి ఉన్న పలువురు విద్యార్థులు ఇబ్బందిగా, భరించరాని అంశంగా భావిస్తున్నారు. ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థులు కొందరిని పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నారని, పోలీసులతో తగాదా పడ్డారని, ఇత్యాది చిన్న కేసులను సైతం భూతద్దంలో చూస్తూ వారిని డిపోర్టేషన్ పేరిట స్వదేశానికి పంపించివేయడం కూడా విద్యార్థులలో ఆందోళన కలుగచేస్తోంది. విద్యార్థులు తమ మనసు మార్చుకుని వేరే దేశాలను ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది.