PNB Scam | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన రూ.13వేలకోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ప్రస్తుతం బెల్జియంలో ఉంటున్న విషయం తెలిసిందే. భారత్ విజ్ఞప్తి మేరకు ఆయనను పోలీసులు అక్కడ ఆయనను అరెస్ట్ చేశారు. భారత్‌కు అప్పగించే విషయంలో వచ్చే సోమవారం నుంచి బెల్జియం కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కోర్టు విచారణకు బెల్జియం ఫెడరల్ ప్రాసిక్యూటర్ నేతృత్వం వహించనున్నారు. సీబీఐ, భారత విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ బృందం సహాయం చేయనున్నది. సమాచారం మేరకు మెహుల్ చోక్సీ 2023 నుంచి బెల్జియంలో నివాసం ఉంటున్నారు. అంటిగ్వా, బార్బుడా నుంచి వైద్య చికిత్సల కోసం బెల్జియంకు వచ్చారు. ఆయన భార్యకు బెల్జియం పౌరసత్వం ఉన్నది.
2024లో మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉన్నట్లుగా సీబీఐ తెలుసుకుంది. ఆ తర్వాత ఆయనను తమకు అప్పగించాలని భారత్ కోరింది. 2020లో భారత్-బెల్జియం మధ్య తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులను అప్పగించే విషయంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కింద విచారణకు వస్తున్న తొలి కేసు ఇదేకావడం విశేషం. చోక్సీని ఈ ఏడాది ఏప్రిల్‌లో బెల్జియం పోలీసులు అరెస్టు చేశాయి. కానీ, అక్కడి కోర్టులు చోక్సీ బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. ఈ కేసు కోసం సీబీఐ ఓ యూరోపియన్ లా ఫర్మ్ సహాయం తీసుకున్నది.
నేరస్తులను అప్పగించే కేసుల్లో లా ఫర్మ్ మంచి పేరున్నది. కోర్టుకు అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అందించేందుకు సీబీఐ బృందం బెల్జియంలో ఉంటున్నది. భారత్‌లో చేసిన ఆరోపణలను బెల్జియంలో కూడా నేరాలుగా పరిగణిస్తున్నట్లుగా నిరూపించేందుకు సీబీఐ చార్జ్షీట్లు, ఎఫ్ఐఆర్లతో పాటు ఆధారాలను సైతం బెల్జియం అధికారులకు అప్పగించింది. దీన్ని డబుల్ క్రైమ్ ప్రిన్సిపల్‌గా పిలుస్తారు. నేరపూరిత కుట్ర, మోసం, ఖాతాలను ట్యాంపరింగ్ చేయడం వంటి ఐపీసీ సెక్షన్ల కింద మెహుల్ చోక్సీపై కేసులు నమోదయ్యాయి.
ఈ నేరాలు బెల్జియన్ చట్టంలో కూడా చేర్చారు. బెల్జియంకు చేసిన విజ్ఞప్తిలో భారత్ ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఎగైనెస్ట్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (UNTOC), యాంటీ-కరప్షన్ కన్వెన్షన్ (UNCAC)లను ఉదహరించింది. 2018-2021లో ముంబయి స్పెషల్ కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్ అరెస్ట్ వారెంట్లను సీబీఐ బెల్జియంకు అందించింది. మెహుల్ చోక్సీ ఇప్పటికీ భారతీయ పౌరుడేనని వాదనలు వినిపించింది. 2017లో ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్నా.. పౌరసత్వాన్ని వదులుకునే ప్రక్రియను పూర్తి చేయలేదని అధికారులు పేర్కొన్నారు. పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొద్దిరోజుల ముందు మెహుల్ చోక్సీ జనవరి 4, 2018న భారత్ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.