(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ మానవాళికి మధుమేహం, ఊబకాయం పెను సమస్యలుగా మారాయి. ప్రపంచంలో ప్రతీ 9 మందిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండగా.. 211 కోట్ల మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి మార్కెట్లో ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ప్రయోజనాలు పరిమితంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన పరిశోధకులు టైప్-2 డయాబెటిస్‌కు చెక్ పెట్టేందుకు ‘రెటాట్రుటైడ్’ పేరిట ప్రయోగాత్మక ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. ట్రిపుల్-యాక్షన్ ఏజెంట్‌గా పనిచేసే ఈ ఇంజెక్షన్‌ను తీసుకొంటే షుగర్ వ్యాధితో పాటు ఊబకాయం తగ్గడమే కాకుండా శారీరక శక్తి పెరుగుతున్నదని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ ఓ కథనంలో వెల్లడించింది.
వ్యాధిని తగ్గించుకోవాలనుకొనే వారు వారానికి ఒకటి చొప్పున మొత్తం 40 వారాలపాటు ఈ ఇంజెక్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కోర్సు పూర్తిచేసిన వారి బ్లడ్ షుగర్ లెవల్స్ 1.9 శాతం మేర తగ్గడమే కాకుండా 100 కిలోలు ఉన్న వ్యక్తి 15-28 కిలోల వరకూ బరువు తగ్గినట్టు పరిచెప్పారు. దీంతోపాటు ఆకలిని పెంచడం, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తూ.. కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఈ ఔషధం మెరుగ్గా పనిచేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు 930 మందిపై నిర్వహించిన మూడో దశ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయి.
ఇంజెక్షన్ పేరు: రెటాట్రుటైడ్
ప్రత్యేకత: ట్రిపుల్-యాక్షన్ ఏజెంట్
ఉపయోగకరం: టైప్-2 డయాబెటిస్ కంట్రోల్, బరువును తగ్గించడం, శక్తినివ్వడం.