Boycott Turkey | న్యూఢిల్లీ: తుర్కియే వస్తువులపై బాయ్‌కాట్ ట్రెండ్ భారత్‌లో మరింత విస్తరించింది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్రా, అజియో..తమ ప్లాట్‌ఫామ్ నుంచి తుర్కియేకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి. మరోవైపు కొంతకాలంగా భారత ‘డెస్టినేషన్ వెడ్డింగ్’లకు కేంద్రంగా ఉంటున్న తుర్కియేలో ఇప్పుడు బ్యాండ్ బాజా బారాత్ సందడి ఆగిపోనున్నది. ఫలితంగా దాదాపు 90 మిలియన్ డాలర్లకు పైగా(దాదాపు రూ.770 కోట్లు) ఆదాయాన్ని ఆ దేశం కోల్పోనున్నది.
అక్కడి ఇస్తాంబుల్ ప్యాలెస్‌లు, తీర ప్రాంతాలు కాబోయే జంటలను ఆకట్టుకోవడంతో గత కొన్నేండ్లుగా భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లి పెండ్లి చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే 2 వేల మంది టూరిస్టులు ఆ దేశానికి తమ పర్యాటకాన్ని రద్దు చేసుకున్నారు. తుర్కియే, అజార్బైజాన్ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న 23 ఒప్పందాలను తాము రద్దు చేసుకుంటున్నట్టు పంజాబ్‌కు చెందిన చండీగఢ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది.