Delhi Exit Polls | న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోటీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. 60.15 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తయిన కొద్ది సేపటికే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అందులో మెజారిటీ సంస్థలు బీజేపీకే అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నాయి. కాగా ఫలితాలను ఈ నెల 8న ప్రకటిస్తారు.
నాలుగోసారీ మేమే వస్తాం: ఆప్
ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను ఆప్ తిరస్కరించింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా నాలుగో సారి అధికారంలోకి వస్తారని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రీనా గుప్తా పేర్కొన్నారు. గత ఎన్నికల్లోనూ ఈ ఎగ్జిట్ పోల్స్ ఆప్‌ను తక్కువగా అంచనా వేశాయని, కానీ 2015, 2020 ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మరోసారి కాంగ్రెస్‌కు సున్నా..?
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుసగా మూడోసారి కూడా శృంగభంగం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు. మూడోసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని అంటున్నారు.