(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. దీంతో పరీక్ష విధానాల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను తాళలేక, పరీక్షలను తిరిగి రాయలేక పలువురు విద్యార్థులు ఉసురు తీసుకొంటున్నారు. ప్రస్తుతం దేశంలో పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపర్ లీక్ కాకుండా.. ఎగ్జామ్ రద్దు కాకుండా చూడాలని ప్రార్థించే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. పేపర్ లీకేజీ కారణంగా నీట్-యూజీ పరీక్షను ఇటీవల రద్దు చేశారు. యూపీ, బీహార్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఉద్దేశించిన ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్ పరీక్షను కూడా రద్దు చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ విద్యార్థుల వివరాలు ఇటీవల బహిర్గతం కాగా.. ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. సాంకేతిక సమస్య కారణంగా సీయూఈటీ-యూజీ పరీక్ష ఆలస్యంగా మొదలవ్వడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయినట్టు ఇటీవలే వార్తలొచ్చాయి.
ఇక, నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరుగడం 2024లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. 2021లో జేఈఈ మెయిన్ పేపర్ హ్యాకింగ్‌కు గురవ్వడం, అదే ఏడాది రాజస్థాన్‌లో నీట్ పేపర్ లీకవ్వడం కలకలం సృష్టించింది. ఇక మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 9 ఏండ్ల వ్యవధిలోనే 13 పరీక్షా పేపర్లు లీక్ అవ్వగా, హర్యానాలో బీజేపీ పాలనలో మొత్తం 28 పేపర్లు లీకయ్యాయి. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలోని యూపీలో మూడేండ్ల వ్యవధిలోనే ఆరు పేపర్లు లీకవ్వగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ పదుల సంఖ్యలో పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూశాయి. ఇక, బీజేపీ ప్రభుత్వం ఉన్న అస్సాంలో రూ. 100కే పదో తరగతి పేపర్‌ను అంగడి సరుకుగా అమ్మకానికి పెట్టడం, ఈ విషయాన్ని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వయంగా ఒప్పుకోవడం సంచలనంగా మారింది.
ఎన్డీయే పాలనలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 2014-15లో బడ్జెట్లో ఈ రంగానికి 4.61 శాతం మేర నిధులు కేటాయించగా, 2024-25 నాటికి ఇది 2.5 శాతానికి పడిపోయింది. అంటే గడిచిన పదేండ్లలో విద్యారంగానికి కేటాయించాల్సిన నిధుల్లో 50 శాతం మేర కోత విధించినట్టు అర్థమవుతున్నది. ఇక, పేపర్ లీకేజీలతో విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకూ పెరిగిపోతుండటం కలవరానికి గురి చేస్తున్నది.

నీట్-యూజీ 2026 పేపర్ లీకేజ్ వివాదానికి సంబంధించిన మరో విద్యార్థి మరణం వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏండ్ల విద్యార్థిని సూసైడ్ నోట్ ఆన్లైన్లో వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఆకాంక్ష చతుర్వేది నీట్ పరీక్షకు సంబంధించిన అక్రమాలు, పేపర్ లీక్ వార్తలతో డిప్రెషన్‌కు గురై నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ ద్వారా బయటపడింది. మే 20న ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. దీనిపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. తన తల్లిదండ్రులకు రాసిన నోట్లో ఆకాంక్ష మళ్లీ నీట్ పరీక్షలు రాయడంపై భయాందోళన వ్యక్తం చేశారు.

అమ్మా, నాన్నా, నేను చదువుకుని డాక్టర్ అవుతానని మీరు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు ఇప్పుడు లేదు. మొదటి నీట్లో నాకు మంచి మార్కులే వచ్చాయి. కానీ రెండోసారి కూడా బాగా రాస్తానని గ్యారెంటీ లేదు. క్షమించండి అమ్మా, నాన్నా. నేను అంతా నాశనం చేసుకున్నాను అంటూ ఆ లేఖలో ఆకాంక్ష పేర్కొన్నారు. ఆమె తండ్రి కృష్ణకుమార్ చౌబే ఒక రైతు. మీడియా కథనాల ప్రకారం ఆయన తన కుమార్తె వైద్య ప్రవేశ పరీక్షల తయారీకి సహాయపడేందుకు కిసాన్ క్రెడిట్ ద్వారా సుమారు రూ.3 లక్షల రుణం తీసుకుని నాగ్‌పూర్‌లో వంటవాడిగా కూడా పనిచేశారు.