Lucknow | మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయన చేరికను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధృవీకరిస్తూ, ట్వీట్ చేశారు. సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న దారాసింగ్ చౌహాన్‌కు హార్థిక స్వాగతం. నమస్కారాలు. సమాజ్‌వాదీ, దాని మిత్రపక్షాలు కలిసి సామాజిక న్యాయ పోరాటాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకెళ్తాం. వివక్ష నిర్మూలనకు కృషి చేస్తాం. ఇది మా సమష్టి సంకల్పం అని అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ బీజేపీలో తుపాన్ కొనసాగుతోంది. కార్మిక మంత్రి స్వామి మౌర్య రాజీనామా చేసి, 24 గంటలు గడిచిందో లేదో మరో మంత్రి రాజీనామా చేసేశారు. అటవీ, ఉద్యానవన మంత్రి దారాసింగ్ చౌహాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. వీరిద్దరూ ఓబీసీ వర్గానికి చెందిన వారే కావడం విశేషం. దారా సింగ్ మవూలోని మధుబన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన వర్గాల వారి మద్దతుతోనే ఏర్పడిందని, అయినా వారి విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తదుపరి కార్యాచరణ ఏంటన్న విషయంలో కార్యకర్తలతో సమాలోచన జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని దారాసింగ్ చౌహాన్ పేర్కొన్నారు. చాలా నిబద్ధతతో మంత్రి బాధ్యతలు నిర్వర్తించా. అయితే వెనుకబడిన వర్గాలు, దళితులు, అణగారిన వర్గాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో చాలా బాధపడుతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నాను అని దారా సింగ్ చౌహాన్ ప్రకటించారు.