బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని హిట్లర్, ముస్సోలినీతో పోల్చారు. అలాంటి నియంతలకు కాలం చెల్లినట్లే మోదీ పాలన కూడా కొన్ని రోజుల్లో ముగుస్తుందని అన్నారు. ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య, కేంద్రం, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు ప్రధాని మోదీపై మండిపడ్డారు. మోదీ కర్ణాటక టూర్‌పై విమర్శలు చేశారు. ‘ఆయన ప్రధానమంత్రి, రానివ్వండి. మాకు ఎలాంటి సమస్యలు లేవు. అయితే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వందసార్లు చెప్పినా అలా జరగదని స్పష్టం చేస్తున్నా’ అని అన్నారు.
కాగా, కర్ణాటక ప్రజలు ప్రధాని మోదీని నమ్మబోరని సిద్ధరామయ్య విమర్శించారు. ఈ సందర్భంగా ఆయనను హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతలతో పోల్చారు. ‘హిట్లర్‌కి ఏమైంది? కొన్ని రోజులు ఆడంబరంగా తిరిగాడు. ముస్సోలినీ, ఫ్రాంకోలకు ఏమైంది? ఆయన (పీఎం మోదీ) కూడా కొన్ని రోజులు మాత్రమే ఇలా అధికారంలో ఉండి తిరుగుతారు. మోదీ పాలన కూడా మరి కొన్ని రోజుల్లో ముగుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సీఎం బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వం దేశం మొత్తానికి తెలుసని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మోదీ ఇమేజ్‌కు ఎలాంటి నష్టం జరుగదన్నారు. కాంగ్రెస్ నేతలు గుజరాత్లో కూడా ఇలాగే మాట్లాడారని, అయినప్పటికి మోదీ ఇమేజ్ వల్ల బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కర్ణాటకలో కూడా అదే జరుగుతుందని అన్నారు.