Jobs | న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24 నిరుద్యోగ నిర్మూలనకు సరైన చర్యలు తీసుకోవటంలో విఫలమైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు అన్నారు. ‘మనకు ఇప్పుడు కావాల్సింది ఉపాధి అవకాశాలు సృష్టించే ఆర్థిక వృద్ధి’ అని గురువారం పేర్కొన్నారు. కరోనా వల్ల నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి వెళ్లిందని తెలిపారు. ‘దేశంలో ప్రతి నెల ఉద్యోగాల కోసం పది లక్షల మంది కొత్తవాళ్లు రోడ్లపైకి వస్తున్నారు. కానీ నెలకు కొత్తగా 5 లక్షల ఉద్యోగాల సృష్టి కూడా జరగటం లేదు’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
దేశంలో నిరుద్యోగ నిర్మూలకు కేంద్రం చేస్తున్న ఆలోచనకు, వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని దువ్వూరి అన్నారు. ‘దేశ జనాభాయే మనకు గొప్ప వరం. కానీ, దానిని సరైన విధానంలో ఉపయోగించుకొనే విధానాలే లేవు. పెరుగుతున్న లేబర్ ఫోర్స్‌కు అవసరమైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మనం ఉత్పాదక ఉపాధి మార్గాలను అన్వేషించాలి’ అని సూచించారు. ‘జీడీపీలో అప్పుల శాతం ఎంత ఉన్నది అనేది మనం ముఖ్యంగా చూడాలి. కరోనాకు ముందు జీడీపీలో అప్పులు 73 శాతం ఉండేవి.
ఎఫ్ఆర్బీఎం సూచించిన 60 శాతం కంటే చాలా ఎక్కువే అప్పులు ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై వడ్డీల భారం తీవ్రంగా ఉంటున్నది. ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాల్లో అతిపెద్ద పద్దు వడ్డీ చెల్లింపులే. మొత్తం వ్యయంలో వడ్డీ చెల్లింపులే 40 శాతం ఉన్నాయి. ఆర్థిక వృద్ధికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాలపై పెడుతున్న ఖర్చుకంటే ఇది చాలా ఎక్కువ’ అని గుర్తు చేశారు.
దేశ అప్పులు పెరిగినంత వేగంగా జీడీపీ పెరగటం లేదని సుబ్బారావు తెలిపారు. ‘రాబోయే ఎన్నికల కోణంలోనే బడ్జెట్‌ను రూపొందించినట్టు కనిపిస్తున్నది. బడ్జెట్లో వ్యయ జాబితాలో అతి పెద్దది అప్పులకు వడ్డీలు కట్టడమే. ఈ బడ్జెట్‌ను బట్టి చూస్తే ఆదాయంలోనూ, వ్యయంలోనూ చాలా సవాళ్లున్నాయని అర్థమవుతున్నది. పన్ను డిజిటైజేషన్, ఫార్మలైజేషన్ వల్ల పన్ను ఆదాయంలో ఒడిదుడుకులు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు జీడీపీ వృద్ధిరేటు అంచనాలను అందుకోవటం కష్టం.
వ్యయం పరిస్థితి ఇలాగే ఉన్నది. తాజా బడ్జెట్లో ఆహారం, ఎరువులపై సబ్సిడీలను భారీగా తగ్గించారు. కానీ, ప్రపంచంలో పరిస్థితులు స్థిరంగా లేకపోవటంతో ఆహార ధాన్యాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉన్నది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కూడా సబ్సిడీలను తగ్గిస్తే తిండికి కటకట ఏర్పడుతుంది. కేంద్రప్రభుత్వం ఊహించినంత వేగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటం లేదు. ఇలాంటప్పుడు ఉపాధి హామీ పథకానికి డిమాండ్ తగ్గదు. మరింత మంది ఈ పథకం కింద ఉపాధి కావాలని కోరుతారు. కానీ, ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో ఈ పథకానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చింది’ అని విశ్లేషించారు.