EVM | ముంబై : మహారాష్ట్ర పుణెలోని సాస్వద్ తహసీల్దార్ ఆఫీసులో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయంలోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. అనంతరం అక్కడున్న ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)ను దుండగులు అపహరించారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తహసీల్దార్ కార్యాలయం అధికారుల ఫిర్యాదు మేరకు సాస్వద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు. ఈవీఎంను అపహరించిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈవీఎంతో పాటు కంట్రోల్ యూనిట్, ఇతర వస్తువులను కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.