Pahalgam : రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడిచేసిన పహల్గాం ప్రాంతంలో ఇప్పటికీ విషాదం అలుముకుంది. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నాటి క్రూరమైన ఘటనను తలుచుకుని పలువురు బాధితులను బోరున విలపిస్తున్నారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన 26 మందిలో శైలేష్ కలాథియా కూడా ఒకరు.
శైలేష్ కలాథియా భార్య శీతల్ కలాథియాను ఉగ్రదాడి గురించి ప్రశ్నించగా భారంగా స్పందించారు. తాము భోజనం కోసం రెస్టారెంట్‌కు వెళ్లి కూర్చున్న కాసేపటికే దాడి జరిగిందని శీతల్ కలాథియా చెప్పారు. ‘మేం భోజనం కోసం రెస్టారెంట్‌కు వెళ్లాం. ఆ తర్వాత కాసేపటికే కాల్పుల శబ్ధం వినిపించింది. ఉగ్రవాదులు మమ్మల్ని చుట్టుముట్టారు. మహిళలను, పురుషులను వేరుచేశారు. ఆ తర్వాత హిందూ పురుషులు, ముస్లిం పురుషులు విడివిడిగా నిలబడాలని హుకుం జారీ చేశారు. మహిళలం అంతా పక్కన నిశ్శబ్దంగా నిలబడిపోయాం. ఉగ్రవాదులు ఏ హానీ చేయకుండా వెళ్లిపోతారని ఆశతో వేచిఉన్నాం. కానీ హిందూ పురుషులందరినీ కాల్చి చంపేశారు. వారితో నా భర్త కూడా ఉన్నాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది’ అని శీతల్ వివరించారు.
ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు తాను సినిమాల్లో మాత్రమే చూశానని, ఈసారే ప్రత్యక్షంగా చూశానని శీతల్ కలాథియా చెప్పారు. ఆ ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందన్నారు. అయితే అంతపెద్ద దాడి జరిగినా అక్కడ భద్రతా సిబ్బంది ఒక్కరూ కూడా లేకపోవడం దారుణమని ఆమె వాపోయారు. శైలేష్ కలాథియా కొడుకు నక్ష్ కలాథియా మాట్లాడుతూ.. తాను, తన సోదరి అమ్మానాన్నతో కలిసి ట్రిప్‌కు వెళ్లామని, మా నాన్నను కోల్పోయామని చెప్పాడు.