Samna | హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేసి.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గారు. నేటి రాజకీయాల్లో అందరూ నితీశ్‌కుమార్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు కారని శివసేన పార్టీకి చెందిన సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. కొందరు ఆత్మగౌరవంతో ఉన్న హేమంత్ సోరెన్‌లు ఉన్నారని.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా గమనించాలంటూ చురకలంటించింది. ‘మోదీ, అమిత్ షా కలిసి హేమంత్ సోరెన్‌ను ఈడీ ద్వారా రాజ్‌భవన్‌లో అరెస్టు చేశారు.
సోరెన్ పార్టీలో ఎమ్మెల్యేల మధ్య చీలికవస్తుంది. ఈడీ ఒత్తిడితో ఎమ్మెల్యేలు పార్టీలు మారతారని బీజేపీ ఆశించింది కానీ అలాంటిదేమీ జరుగలేదు. హేమంత్ సోరెన్ వారసుడు చంపై సోరెన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 29 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇంత మెజారిటీ ఉన్నప్పటికీ నాలుగు రోజుల తర్వాత చంపై సోరెన్‌తో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ నాలుగు రోజుల్లో సోరెన్ ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవచ్చని మోదీ-షా భావించారు. కానీ, జార్ఖండ్‌లోని ఆత్మగౌరవ గిరిజనులు వారికి తలొగ్గలేదు.
అరెస్ట్ అయిన తర్వాత అసెంబ్లీకి వచ్చి తనదైన శైలిలో ప్రసంగించారని.. మోదీ-షా ప్రతీకార రాజకీయాలను సవాల్ చేశారు’ అని పేర్కొన్నది. విశ్వాస పరీక్షలో ఓటింగ్‌కు హాజరైన హేమంత్ సోరెన్ మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఏడెకరాల భూమికి సంబంధించిన లావాదేవీల్లో తనను అరెస్టు చేశారని.. ఈ భూమికి సంబంధించిన పత్రాలను ఈడీ బయటకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ముందుకు తీసుకువస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అంతే కాకుండా జార్ఖండ్‌ను శాశ్వతంగా వదిలేస్తానన్నారు.
సోరెన్ అరెస్టు రాజకీయ ఉగ్రవాదమని.. అణచివేతకు సంబంధించిన భయంకరమైన కేసు అని సామ్నా తన సంపాదకీయంలో విమర్శించింది. రాష్ట్రంలోని సిట్టింగ్ సీఎంను తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. హేమంత్ సోరెన్ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు మోదీ-షా సిద్ధమవుతున్నారని ఆరోపించింది. బెదిరింపులతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఇప్పటికే కూల్చారని.. బిహార్‌లో నితీశ్ కుమార్‌తో ‘ఫ్లిప్’ చేయించారని పేర్కొంది.
నితీశ్‌కుమార్ సన్నిహితులపై ఈడీ దాడులు చేసిందని.. అందుకే నితీశ్‌కుమార్ తలవంచ్చినట్లు సామ్నా పేర్కొంది. లాలూయాదవ్, ఆయన కుటుంబం మోదీ-షా తలవంచేందుకు సిద్ధంగా లేరన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రకంపనలు సృష్టించారని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. కేజ్రీవాల్ తాను బీజేపీ అణచివేతకు తలొగ్గనని అంటున్నారని.. మహారాష్ట్రలో శివరాయ్ వారసత్వం చెబుతుంది కానీ.. మార్త్-మర్హతే అని చెప్పుకునే వారు ఢిల్లీ కాళ్లపై పడ్డారని విమర్శించింది. జార్ఖండ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు పోరాటానికి కత్తులు దూశారంటూ బీజేపీ తీరును ఎండగట్టింది.
సొంతంగా బలం లేని చోట కూలదోస్తుందని.. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం.. ఇది ఏం చట్టం.. ఏం స్వేచ్ఛ అంటూ ప్రశ్నించింది. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా మోదీకి ఇష్టమైన వ్యక్తులయ్యారు.. కానీ సోరెన్, కేజ్రీవాల్ మాత్రం వారి దృష్టిలో నేరస్తులుగా మారారని సామ్నా విమర్శలు గుప్పించింది. భారతీయ జనతా పార్టీ అవినీతి గూడుగా మారిందని, నైతికత వంటి మాటలకు అక్కడ విలువ లేదని.. ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి హేమంత్ సోరెన్ జైలు శిక్ష సరైన ఉదాహరణగా మారాలని పేర్కొంది.
అరవింద్ కేజ్రీవాల్ తలవంచడానికి సిద్ధంగా లేరని.. ఉద్ధవ్ ఠాక్రే నిరాకరించారని.. మమతా బెనర్జీ పోరాట యోధురాలని పేర్కొంది. హేమంత్ సోరెన్ మోకరిల్లలేదని, ఏడువలేదని.. తలవంచలేదన్న సామ్నా.. విప్లవకారుడిలా జైలుబాట పట్టాడని ప్రశంసించింది. ‘ఈ పోరాటం ద్వారా కొత్త దిశ, స్వాతంత్య్ర వెలుగులు అందుతాయని.. తలవంచి లొంగిన వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని.. యోధుల కన్నీళ్ల విలువను హేమంత్ సోరెన్ చెప్పారు.. ఆ కన్నీళ్ల నుంచే రేపటి తుపాను సృష్టిస్తుంది!’ అంటూ సామ్నా సంపాదకీయం రాసుకొచ్చింది.