Third State | న్యూఢిల్లీ: ఏ ప్రాణికి అయినా జీవం, మరణం అనే రెండు దశలే ఉంటాయనేది గతంలో ఉన్న అభిప్రాయం. అయితే, జీవి మరణించినా కొన్ని అవయవాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయని అవయవ మార్పిడి ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు పరిశోధకులు సరికొత్త విషయాన్ని గుర్తించారు. జీవి మరణించినా, దానిలోని కొన్ని కణాలు మాత్రం కొంతకాలం బతికే ఉంటాయని వెల్లడించారు. జీవం, మరణానికి ఇది భిన్నమైన మూడో దశ అని తెలిపారు.
ఇందుకు సంబంధించి జరిపిన అధ్యయన వివరాలు ‘ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సింథటిక్ బయోలజీ రంగంలో సరికొత్త మార్పులు తెస్తున్న బయోలాజికల్ రోబోల్లో(బయోబోట్) ఈ కణాలను వినియోగించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే, ముందుగా కణాలు ఎలా స్పందిస్తాయనేది గుర్తించడం శాస్త్రవేత్తలకు సవాల్‌గా ఉంటుందని అధ్యయనంలో పాల్గొన్న పీటర్ నోబెల్, అలెక్స్ పోజిట్కోవ్ తెలిపారు. జీవి మరణం తర్వాత కూడా ఈ కణాలు ఎలా జీవించగలుగుతున్నాయి అనేది శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదని వీరు పేర్కొన్నారు.