Amit Shah | జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత – స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ స్వర్గం నుంచి దిగి వచ్చినా 370 అధికరణాన్ని పునరుద్ధరించలేరని వ్యాఖ్యానించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి సర్కార్.. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి 370 అధికరణం రద్దు చేయడంతోపాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ చట్టం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అయోధ్యలో ఏండ్ల తరబడి రామ మందిరం నిర్మించకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉద్దేశపూర్వకంగా నిలిపేసిందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ పార్టీని తప్పు బట్టారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని అధికార మహాయుతి కూటమి తరఫున అమిత్ షా ఎన్నికల ప్రచారం చేశారు. బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన మూడు సభల్లో మాట్లాడుతూ శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) సారధ్యంలోని మహా వికాస్ కూటమి మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడి చేశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమిని ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ అని అభివర్ణించారు. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి మరాఠా చక్రవర్తి శివాజ్ మహారాజ్, స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తుందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు కుదించాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం నక్సలైట్లు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేదన్నారు.