ఇక బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్‌గా ఆ పత్రం సమర్పించాల్సిందే
న్యూఢిల్లీ, మార్చి 1: పాస్‌పోర్టు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. సవరించిన పాస్‌పోర్టు నిబంధనలు 1980 ప్రకారం ఇక నుంచి 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించినవారు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే జనన, మరణాల రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఏ ఇతర అధికార యంత్రాంగం జారీ చేసిన సర్టిఫికెట్‌ను మాత్రమే జన్మదిన ధ్రువీకరణ పత్రంగా సమర్పించాలి.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అక్టోబర్ 1, 2023కు ముందు జన్మించిన వారు జనన ధ్రువీకరణ రుజువుగా ఇతర పత్రాలను సమర్పించవచ్చు. దీని ప్రకారం స్కూళ్లు జారీ చేసే టీసీలు, మెట్రిక్యులేషన్, టెన్త్‌కు సంబంధించి బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్లు, ఐటీ శాఖ జారీ చేసే పాన్ నెంబర్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సర్వీస్ రికార్డు కాపీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఆర్డర్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఫొటో ఐడెంటిటీ కార్డు, ఎల్ఐసీ, ఇతర పబ్లిక్ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్లను జనన ధ్రువీకరణ పత్రాలుగా సమర్పించవచ్చు. ఇప్పుడు సవరించిన నిబంధనలు కూడా 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి వర్తిస్తాయని చెప్పారు. కాబట్టి గ్రామీణులకు ఇవి పెద్దగా ఇబ్బంది కలగించవని అధికారులు స్పష్టం చేశారు.