న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. ఈ నెలాఖరులోగా 7 కోట్లకు పైగా చందాదారుల ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆమోదం అందుకున్న తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ కార్యాలయం ప్రారంభిస్తుందని వారు చెప్పారు. ఈపీఎఫ్వో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రోల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సిఫార్సు చేసిన 8.25% వడ్డీ రేటుకు మంత్రిత్వశాఖ ఇప్పుడు ఆమోదం మాత్రమే తెలిపింది.
ఈ ఏడాది మార్చి 2న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశం 2025-26 సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. ఈపీఎఫ్ వడ్డీ రేటు మారకుండా కొనసాగడం ఇది వరుసగా మూడవ సంవత్సరం. ఈపీఎఫ్వో అభివృద్ధి చేసిన కొత్త డిజిటల్ వ్యవస్థలో సంబంధిత ప్రక్రియ ప్రారంభమైన వెంటనే చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది.