శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇంజినీర్ రషీద్‌గా (Engineer Rashid) పేరు గాంచిన ఆయన ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కట్టు కథకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశారు. 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన రషీద్, ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఎంపీగా గెలిచారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి ప్రచారం కోసం బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు.
కాగా, తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని రషీద్ ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విఫల కథనాన్ని ప్రజల్లో ఎండగడతానని అన్నారు. ‘నా ప్రజలను నేను నిరాశపరచను. ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కథనంపై పోరాడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇది పూర్తిగా విఫలమైంది. 2019 ఆగస్ట్ 5న ఆయన ఏమి చేసినా (ఆర్టికల్ 370 రద్దు) ప్రజలు తిరస్కరించారు’ అని అన్నారు.
మరోవైపు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినదాని కన్నా తన పోరాటం పెద్దదని రషీద్ తెలిపారు. ‘ఆయన (ఒమర్ అబ్దుల్లా) పోరాటం కుర్చీ కోసం. నా పోరాటం ప్రజల కోసం’ అని అన్నారు. బీజేపీ తనపై అణచివేత వ్యూహాలను ప్రయోగిస్తోందని రషీద్ ఆరోపించారు. ‘నేను బీజేపీ బాధితుడ్ని. నా చివరి శ్వాస వరకు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతా’ అని అన్నారు.
కాగా, సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీకి ప్రచారం కోసం ఢిల్లీ కోర్టు రషీద్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించిన ఆయన పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది.