Valmiki Scam | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వెలుగుచూసిన ‘వాల్మీకి’ కుంభకోణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్ ట్రైబ్ శాఖ మాజీ మంత్రి బీ నాగేంద్రేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం వెల్లడించింది. బెంగళూరులోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఇటీవలే ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు గుర్తు చేసింది. రూ. 187 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో నాగేంద్రతో పాటు మరో 24 మంది పాలు పంచుకొన్నారని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి, మధ్యవర్తి సత్యనారాయణ వర్మ, ఫస్ట్ ఫైనాన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ ఏటకారి సత్యనారాయణ, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జేజీ పద్మనాభ, అధికారులు నాగేశ్వరరావు, నెక్కెంటి నాగరాజు, విజయ్‌కుమార్ గౌడ తదితరులు ఈ జాబితాలో ఉన్నట్టు పేర్కొంది. నాగేంద్ర కనుసన్నల్లోనే వాల్మీకి కార్పొరేషన్ నుంచి రూ. 187 కోట్లు పక్కదారిపట్టినట్టు వివరించింది. ఇందులో రూ. 20.19 కోట్లను ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు తెలిపింది. అక్రమంగా తరలిన మరికొంత నగదు హైదరాబాద్‌కు చేరినట్టు వివరించింది. ఈ స్కామ్‌కు సంబంధించి బుధవారం ఈడీ ప్రాసిక్యూషన్ కైంప్లెంట్ దాఖలు చేసింది.
‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ. 187 కోట్లు పక్కదారిపట్టాయి. దీన్నే ‘వాల్మీకి కార్పొరేషన్’ స్కామ్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఈ స్కామ్ జరిగినట్టు ఎవరికీ తెలియదు. అయితే, వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ గత మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. వాల్మీకి కార్పొరేషన్ నుంచి చట్ట విరుద్ధంగా పలు బ్యాంకు ఖాతాలకు రూ.187 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని చంద్రశేఖరన్ తన ఆరు పేజీల సూసైడ్ నోటులో పేర్కొన్నారు. దీనిపై గిరిజన సంఘాలు, ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టాయి. ప్రత్యేక బృందంతో విచారణ చేయించాలని పట్టుబట్టాయి. సర్వత్రా ఒత్తిడి పెరుగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఈ కుంభకోణంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అటు ఈడీ కూడా ఈ స్కామ్‌పై విచారణ ప్రారంభించింది.
లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. అయితే, నిధుల బదిలీని వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ తొలుత వ్యతిరేకించడంతో ఆయన్ని తప్పించినట్టు సమాచారం. దీంతో ఆయన గత మే 26న ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే, తన మరణ వాంగ్మూలంలో స్కామ్‌కు సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టారు. దీంతో విచారణ జరిపిన ఈడీ కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బసనగౌడ దద్దల్, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా 11 మందిని అరెస్ట్ చేసింది.
వాల్మీకి కార్పొరేషన్ నుంచి దారిమళ్లిన మొత్తం రూ. 187 కోట్లలో తెలుగు రాష్ర్టాలకు రూ. 90 కోట్లు చేరినట్టు సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఇందులో రూ. 44.6 కోట్లు హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది కంపెనీల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టు వివరించింది. సిట్ నివేదిక ప్రకారం.. వాల్మీకి కార్పొరేషన్ ఎండీ, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జేజీ పద్మనాభ్, సస్పెండైన అకౌంట్స్ అధికారి పరశురామ్ బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్డు బ్రాంచీలో మార్చి 30, 2024న రూ. 50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ టర్మ్ డిపాజిట్‌పై అదే రోజు రూ. 45 కోట్ల మేర రుణానికి దరఖాస్తు చేశారు. ఇందులో నుంచి అదేరోజు హైదరాబాద్‌లోని ఆర్బీఎల్ బ్రాంచీకి చెందిన 9 బ్యాంకు ఖాతాలకు రూ. 44.6 కోట్లను బదిలీ చేశారు. ఈ మేరకు సిట్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌కు చేరిన రూ. 44.6 కోట్ల నగదుతో లోక్‌సభ ఎన్నికల ముందు పెద్దయెత్తున మద్యం, ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
‘వాల్మీకి స్కామ్’ విచారణను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టిస్తున్నట్టు అర్థమవుతున్నది. సిట్ రెండో ఛార్జిషీట్లో కుంభకోణంలో ప్రధాన నిందితులైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బసనగౌడ దద్దల్, బ్యాంకు ప్రధానాధికారి పేర్లు కనిపించకపోవడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. వాల్మీకి స్కామ్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ సుచిస్మితా రావల్, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జేజీ పద్మనాభ, మాజీ అకౌంట్స్ అధికారి పరశురామ్ జీ దుర్గాన్నవార్ పాత్ర ఉన్నట్టు తన సూసైడ్‌నోట్‌లో చంద్రశేఖరన్ వెల్లడించారు. నాగేంద్ర, బసనగౌడ దద్దల్ కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, తొలి ఛార్జీషీట్లో వీరి పేర్లను ప్రస్తావించిన సిట్.. శివమొగ్గ జిల్లా కోర్టుకు ఇటీవల సమర్పించిన రెండో ఛార్జీషీట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. జేజీ పద్మనాభ, పరశురామ్ జీ దుర్గాన్నవార్ పేర్లను మాత్రమే సిట్ ఈ ఛార్జిషీట్లో ప్రస్తావించి చేతులు దులుపుకొన్నది. దీంతో మాజీ మంత్రి నాగేంద్ర, కార్పొరేషన్ ఛైర్మన్‌తో పాటు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న యూబీఐ బ్యాంకు చీఫ్ మేనేజర్‌ను కాపాడటానికే సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.