Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది. గురువారం ఏర్పడనున్న క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ టీవీకే అధినేత, సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు విజయ్ మంత్రివర్గంలో చేరబోతున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఇది చారిత్రక సందర్భం అని, 59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో చేరబోతున్నామని వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా తమ పార్టీ నుంచి మంత్రులుగా చేరనున్న ఎమ్మెల్యేలకు వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. డీఎంకేతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ.. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేతో చేరింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. టీవీకే అత్యధికంగా 107 సీట్లు సాధించింది.
అధికారం ఏర్పాటు చేసేందుకు 118 సీట్లు అవసరం. దీంతో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలతో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో విజయ్ ప్రభుత్వం అవిశ్వాసం నెగ్గింది. విజయ్ పార్టీకి మెజారిటీ రాకపోవడం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. మంత్రివర్గంలో చేరేందుకు అవకాశం కల్పించింది.