బరేలీ, సెప్టెంబర్ 17: యూపీలోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు ఘజియాబాద్‌లోని ట్రోనికా నగరంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతులను రవీంద్ర అలియాస్ కల్లు, అరుణ్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ రోహిత్ గొడారా-గోల్డ్ బ్రార్ గ్యాంగ్‌లో చురుకైన సభ్యులని, వీరిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 12న బైక్‌పై వచ్చిన వీరిద్దరూ దిశా పటానీ ఇంటి బయట కాల్పులు జరిపారు. వీరు ఉపయోగించిన బైక్ ఆధారంగా పోలీసులు వీరి కదలికలు గుర్తించారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, హర్యానా స్పెషల్ టాస్క్ఫోర్సు, ఢిల్లీ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో వీరి జాడను పసిగట్టి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వీరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి జగదీశ్ పటానీ లక్ష్యంగా ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.