Encounter : ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని సుక్మా జిల్లా (Sukma district) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగ్డు, మరో కీలక నేత హితేశ్ ఉన్నారు.
ఘటనా స్థలంలో భద్రతాబలగాలు ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కిష్టారం పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ క్రమంలో పామ్లూరు గ్రామం సమీపంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి.
ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మంగ్డు మినహా మిగతా వారి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు బీజాపుర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా గత ఏడాది జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 285 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు.