న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకుంటే ‘ప్రో రేటా ప్రాతిపదికన’ చెల్లింపులు పొందేందుకు అర్హులని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు పెన్షన్, పెన్షనర్ల విభాగం యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్) కింద కొత్త నిబంధనలను చేరుస్తూ ఈ నెల 2న అధికారిక గెజిట్‌లో నోటిఫై చేసినట్టు తెలిపింది. మారిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన అనంతరం వీఆర్ఎస్ పొందవచ్చు. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పూర్తిగా 25 ఏండ్ల సర్వీసు పూర్తయిన తరువాతనే పొందే అవకాశం ఉంటుంది. వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే ‘ప్రో రేటా ప్రాతిపదికన’ మాత్రమే నగదు సదుపాయాలను పొందవచ్చని సిబ్బంది మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
అంటే ఉద్యోగి సాధారణ రిటైర్మెంట్ అనంతరం పొందే పూర్తి సదుపాయాలలో కొంత మేరకే పొందే అవకాశం ఉంటుందని వివరించింది. అంతే కాకుండా కొత్త నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలలో వ్యక్తిగత కార్పస్‌లో 60 శాతం వరకు పొందవచ్చని తెలిపింది. వీఆర్ఎస్ తీసుకున్నవారు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సీజీఈజీఐఎస్ సదుపాయాలకు అర్హులవుతారని పేర్కొంది. ఈ అదనపు సదుపాయాలన్నీ వీఆర్ఎస్ తీసుకున్నా లేక సర్వీసు పూర్తి రిటైర్ అయినా లభిస్తాయని తెలిపింది. ఒకవేళ వీఆర్ఎస్ పొందాలని నిర్ణయించి సదుపాయాలను పొందకముందే మరణిస్తే వారి జీవితభాగస్వామికి ఈ సదుపాయాలు అందుతాయని పేర్కొంది.