న్యూఢిల్లీ, డిసెంబర్ 31: టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త సంవత్సరం వేళ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన పేరు మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు కెకియస్ మాక్సిమస్. తన ప్రొఫైల్ పిక్చర్‌గా పేరుమోసిన పీప్ ది ఫ్రాగ్(కప్ప) మీమ్‌ను ఆయన మార్చారు. యోధుడి వస్త్రధారణలో ఉన్న పీప్ చేతిలో వీడియో గేమ్ జాయ్‌స్టిక్ పట్టుకుని ఉంది. ఎక్స్ వేదికగా చమత్కారాలతో కూడిన పోస్టులు ట్వీట్ చేసే మస్క్ హఠాత్తుగా పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వివరించలేదు.
అయితే ఆయన ఇటీవల పోస్టు చేస్తున్న మీమ్ కాయిన్కెకియస్ మాక్సిమస్ క్రిప్టోకర్సెన్సీ మార్కెట్లో పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మస్క్ తన పేరును ఎక్స్‌లో మార్చుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే మీమ్‌కాయిన్ కెకియస్ మాక్సిమస్ క్రిప్టోకరెన్సీ మార్కెట్లో 500 శాతం పెరిగిపోయింది. కెకియస్ మాక్సిమస్ అనే పాత్ర ఏదీ లేనప్పటికీ పీప్ ది ఫ్రాగ్ మీమ్ తరహాలోనే గ్లాడియేటర్ చిత్రంలోని మాక్సిమస్ పాత్ర నుంచి ఇది పుట్టింది. అయితే పీప్ ది ఫ్రాగ్ చిహ్నాన్ని అమెరికాలోని మితవాద గ్రూపులు విద్వేష చిహ్నంగా పరిగణిస్తాయి.