సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) గుట్టు రట్టయింది. ఓ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి, అసాధారణ రీతిలో చేపట్టిన రీకౌంటింగ్‌లో ఫలితం తారుమారైంది. కోర్టు సమక్షంలోనే రీకౌంటింగ్ చేపట్టగా, తొలి ఫలితానికి భిన్నమైన ఫలితం వచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈవీఎంలపై ప్రతిపక్షాలు మొదటి నుంచీ వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమేనని ఈ ఉదంతంతో తేలిపోయింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 13: హర్యానాలోని బు ఆనా లాఖూన్ గ్రామ పంచాయతీకి 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నిక జరిగింది. ప్రత్యర్థి మోహిత్పైన కుల్దీప్ సింగ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నిక ఫలితాన్ని సవాలు చేస్తూ ఓడిపోయిన అభ్యర్థి మోహిత్ కుమార్ అదనపు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్)-కం-పానిపట్ ఎన్నికల ట్రిబ్యునల్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. మే 7న డిప్యూటీ కమిషనర్-కం-ఎన్నికల అధికారి బూత్ నంబర్ 69 ఓట్లను రీకౌంటింగ్ చేయాలని 2025 ఏప్రిల్ 22న ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే 2025 జూలై 1న ట్రిబ్యునల్ ఉత్తర్వును పంజాబ్, హర్యానా హైకోర్టు పక్కనపెట్టింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మోహిత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక పోలింగ్ బూత్ కాకుండా అన్ని పోలింగ్ బూత్‌లకు చెందిన ఈవీఎంలు, ఇతర రికార్డులను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని సుప్రీంకోర్టు జూలై 31న అదేశించింది. ఆగస్టు 6న ఉదయం 10 గంటలకు సెక్రటరీ జనరల్ నామినేట్ చేసిన కోర్టు రిజిస్ట్రార్ ఎదుట ఈవీఎంలను ఉంచాలని పానిపట్ జిల్లా ఎన్నికల అధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని బూత్‌లకు చెందిన ఈవీఎంలను లెక్కించాలని, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఫలితం తారుమారు..
సుప్రీంకోర్టు తన సమక్షంలోనే ఓట్లను రీకౌంటింగ్ చేయడంతో ఫలితాలు తారుమారయ్యాయి. ఇరుపక్షాల అభ్యర్థులు, వారి న్యాయవాదుల సమక్షంలో సుప్రీంకోర్టు ఓఎస్డీ(రిజిస్ట్రార్) కావేరి ఆగస్టు 6న రీకౌంటింగ్ నిర్వహించగా మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మొత్తం 3,767 ఓట్లు పోలింగ్ కాగా పిటిషనర్ మోహిత్ కుమార్‌కు 1,051 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి కుల్దీప్ సింగ్‌కి అనుకూలంగా 1,000 ఓట్లు వచ్చాయి. దీంతో బు ఆన్ లాఖూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పిటిషనర్ మోహిత్ కుమార్ గెలుపొందినట్లు ప్రకటిస్తూ రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీచేయాలని పానిపట్ డిప్యూటీ కమిషనర్ (ఎన్నికల అధికారి)ని ఆదేశిస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 11న వెలువరించిన ఉత్తర్వులో పేర్కొంది. పిటిషనర్ మోహిత్ కుమార్ వెంటనే సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టవచ్చని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.