Electrocution : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్పాయిగురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమ ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడే ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. జాల్పాయిగురి జిల్లాలోని ఓ గ్రామంలో పరేష్ (60) కుటుంబం నివాసంలో ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం పరేష్ ఇంటి ముందు వాననీటిలో కరెంటు వైరు తెగిపడింది. ఆ వైరు ఆవు కాళ్లకు తగలడంతో పరేష్ కొడుకు గమనించి ఆవును రక్షించబోయాడు. కానీ అతనికి షాక్ తగిలింది. కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో పరేష్, ఆయన భార్య దీపాలి (55) కూడా షాక్ గురై మరణించారు.
మరో దారుణమైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదంలో దీపాలి ఎత్తుకుని ఉన్న ఆమె మనుమడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నాలుగు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.