Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బాండ్ల పేరుతో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికార పార్టీపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని నిర్వీరం చేసినందుకు ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ద్వారా మొత్తం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బు వసూలు చేసేందుకు నాలుగు పద్ధతులను బీజేపీ ఉపయోగిస్తోందని కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. గతేడాది కాలంలో మీడియా ఎలక్టోరల్ బాండ్లపై అనేక కథనాలు, పేర్లను ప్రచురించాయని తెలిపారు. చాలా కేసుల్లో మొదటి దర్యాప్తు సంస్థలు కంపెనీలపై దాడులు చేశాయని.. ఆ తర్వాత ఆయా కంపెనీలు చాలా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశాయన్నారు.
బాండ్ల కొనుగోలు తర్వాత కేసుల దర్యాప్తు వేగం మందగించినట్లు కనిపించిందని ఆరోపించారు. రూ.100కోట్ల మూలధనం లేని కంపెనీలు రూ.500కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం చూశామన్నారు. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే నాలుగో అంశం సింఘ్వీ అన్నారు. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నిబంధన ఉందని.. కేసు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురిపై కేసు నమోదైంది. ఈడీ అధికారులు, రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతల పేర్లు సైతం ఉన్నారు. ఈ 384, 120బీ, 34 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర, ఆ పార్టీ నేత నళిన్ కుమార్ కటీల్ పేర్లు ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని, రూ.8వేలకోట్లకుపైగా వసూలు చేశారని జనాధికార సంఘర్ష్ పరిషత్ కో చైర్మన్ ఆదర్శ్ ఆర్ అయ్యర్ ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారుల మద్దతుతోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రయోజనాల కోసం వేలకోట్లు దోపిడీ చేసినట్లు ఆయన ఆరోపించారు.