న్యూఢిల్లీ, అక్టోబర్ 16: రాజకీయ పార్టీలకు విరాళాలకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
నిశ్చయాత్మక తీర్పు కోసం ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపాలని కోరుతూ వచ్చిన దరఖాస్తుపై ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్ 30కు వాయిదా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోగానే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై న్యాయ నిర్ణయం జరుగాల్సిన అవసరం ఉన్నదని అంతకుమందు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొన్నది.