Mizoram Elections | ఐజ్వాల్, నవంబర్ 5: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హెచ్ లియాంజెలా పేర్కొన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు.
మూడు పార్టీల ముమ్మర ప్రచారం మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. గత ఐదేండ్లలో చేపట్టిన అభివృద్ధిని చెప్పుకోవడంతోపాటు శరణార్ధులు, ఇతర ప్రాంతాల నుంచి వలసల అంశాన్ని ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించింది.
అటు మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో భాగంగా ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందనే ప్రధాన ప్రచారాస్త్రంతో ముందుకెళ్లింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉన్నది. మార్పు రావాలనే నినాదంతోపాటు కొత్త పాలనా వ్యవస్థను తీసుకొస్తామన్న హామీపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకొన్నది.