న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. పరస్పర ఆరోపణలతో మాటల దాడికి పదునుపెడుతున్న నేతలు ఒకింత దూకుడుతో సవాళ్ల పర్వానికీ తెరతీశారు. నిరుద్యోగం అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సవాల్ చేయగా చర్చకు సిద్ధమేనని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించారు.
అభివృద్ధి అంశాలపై ఆప్ నేత భగవంత్ మాన్ సిద్ధూతో చర్చకు వస్తారని కేజ్రీవాల్ స్పందించారు. భగవంత్ మాన్ లిక్కర్ మాఫియాను నడుపుతున్న సీఎం కాదని..నేరుగా కేజ్రీవాల్ తనతో చర్చకు రావాలని సిద్ధూ పట్టుపట్టారు. పంజాబ్‌లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆప్ నేత కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత సిద్ధూ మధ్య ఇటీవల పలుమార్లు మాటల యుద్ధం చోటుచేసుకుంది. పంజాబీలపై హామీల వర్షం కురిపిస్తున్న కేజ్రీవాల్ ఈ పధకాలు, కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారని సిద్ధూ నిలదీశారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ సీఎం శాండ్ మాఫియాతో చేతులు కలిపి దోపిడీ సాగిస్తున్నారని, ఇసుక దోపిడీ ఆపితే రూ 20,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తాయని కేజ్రీవాల్ దీటుగా బదులిచ్చారు. ఇక దీనిపై కేజ్రీవాల్‌కు సిద్ధూ సైతం దీటుగా ప్రతిస్పందించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ పరిశ్రమను ప్రైవేటీకరిస్తోందని, రూ 30,000 కోట్ల విలువైన లిక్కర్ పరిశ్రమను ప్రైవేటీకరించి ఆప్ నేతలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.