న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ, వెబ్‌క్యాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులు వంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ప్రజల పరిశీలన నుంచి నివారించేందుకు ఎన్నికల నిబంధనను కేంద్రం సవరించింది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకునేందుకే ఈ చర్యను చేపట్టినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల కమిషన్ సిఫార్సు ఆధారంగా 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని 93(2)(ఎ) నిబంధనను కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరించింది.
ప్రజల పరిశీలనకు అవకాశం కల్పించే పత్రాలు లేదా డాక్యుమెంట్లపై ఆంక్షలు విధించడమే ఈ సవరణ ఉద్దేశం. 93 నిబంధన ప్రకారం ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలను ప్రజలు పరిశీలించవచ్చు. పత్రాలు అన్న పదం తర్వాత నిబంధనలు నిర్దేశించినట్టుగా అన్న పదాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఈ నిబంధనలో చేర్చింది. ఎన్నికల పత్రాలు, డాక్యుమెంట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, పోలింగ్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ దుర్వినియోగం కారాదన్న ఉద్దేశంతో ఆ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను మాత్రం ప్రజల పరిశీలనలో ఉంచబోమని ఆయన స్పష్టం చేశారు.