EC | న్యూఢిల్లీ: ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిలో లా కమిషన్ పంపిన ప్రశ్నావళిపై ఈసీ స్పందిస్తూ, ఎన్నికలు ఎంత కాలానికి ఒకసారి జరుగుతాయి? ఎంత తరచుగా జరుగుతాయి? అనే అంశాలపై దీని అమలు ఆధారపడి ఉంటుందని చెప్పింది.
ఈ అంశాలను హేతుబద్ధం చేస్తే, ఎంసీసీ అమలు కాలాన్ని కుదించవచ్చునని వివరించింది. ఎంసీసీని అందరూ స్వచ్ఛందంగా అమలు చేయాలని రాజకీయ పార్టీలతో చర్చల తర్వాత వెల్లడైనట్లు తెలిపింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు, నమ్మదగిన ఫలితాలు రావడానికి ఎంసీసీ మూలాధారమని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అత్యంత తక్కువ సమయం ఉండేలా చూడటం కోసం వ్యూహాలను అమలు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది.
ఎంసీసీని విధించడం వల్ల విధానాల అమలులో ప్రతిష్టంభన ఏర్పడుతున్నదా? అని ఎన్నికల కమిషన్ను లా కమిషన్ ప్రశ్నించింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై ఈసీ తన వైఖరిని లా కమిషన్కు, కేంద్ర న్యాయ శాఖలోని న్యాయ వ్యవహారాల విభాగానికి తెలిపింది. జమిలి ఎన్నికల బిల్లుల పరిశీలన కోసం ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సభ్యులకు ఎన్నికల కమిషన్ వైఖరిని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.