న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల తేదీలను (Election Schedule) ప్రకటించనుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది.
243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. గడువులోగా ఎన్నికలు పూర్తిచేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా, 2020లో జరిగిన ఎన్నికల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగగా.. అంతకుముందు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రచురించింది.
కాగా, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత కోసం తీసుకొచ్చిన 17 సంస్కరణలను బీహార్ ఎన్నికల నుంచే అమలు చేయనుంది. వీటిలో పోలింగ్ సందర్భంగా కొన్ని, ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని అమలవుతాయి. ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. తాజా సవరణతో బీహార్లో ప్రస్తుతమున్న 77,895 పోలింగ్ కేంద్రాలు 90,712కి పెరుగనున్నాయి.