చెన్నై: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున మద్యం, డ్రగ్స్, నగదు పంపిణీకి ప్రయత్నించారు. వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు జరిపిన సోదాల్లో రూ.1,072 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్, నగదు పట్టుబడింది. ఏప్రిల్ 22 నాటికి రెండు రాష్ర్టాల్లో ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్టు ఈసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీజ్ చేసిన వాటిల్లో రూ.437 కోట్ల విలువజేసే ‘ఉచితాలు’ ఉన్నాయని తెలిపింది.
పశ్చిమ బెంగాల్లో రూ.472 కోట్లు, తమిళనాడులో రూ.599 కోట్లు విలువజేసే మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. దీంట్లో నగదు రూ.127 కోట్లు, రూ.106 కోట్ల విలువజేసే 40 లక్షల లీటర్ల మందు సీసా బాటిళ్లు, రూ.184 కోట్ల మాదకద్రవ్యాలు ఉన్నాయని ఈసీ తెలిపింది.