న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (Special Intensive Revision) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానా, చండీఘడ్తో పాటు అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ జరుగుతోంది. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివరాలు సేకరిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వోలు), బూత్ లెవల్ సూపర్వైజర్లు(బీఎల్ఎస్)కు గౌరవ వేతనంగా 6 వేలు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మంగవారం రాత్రి ఆ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలోనూ సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తమ విధులకు ఇచ్చే జీతంతో పాటు ఒక్కసారి మాత్రమే అదనంగా 6వేల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నట్లు ఈసీ పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ఫ్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయూ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్నాటక, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం సర్ ప్రక్రియ చేపట్టారు. అయితే ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవల్ అధికారులకు ఈ ప్రక్రియ వల్ల లబ్ధి చేకూరనున్నది.