Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ వెబ్సైట్లో పెట్టింది. సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరోసారి వెబ్సైట్లో వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఎక్స్‌లో ఈసీ పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను పీడీఎఫ్ రూపంలో అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈసీ డేటాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
అయితే, ఎస్బీఐ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎన్నికల కమిషన్‌కు అందించకపోవడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఎస్బీఐ తీరును తప్పుపట్టింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిపై ఈ నెల 11న తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించలేదంటూ మండిపడింది.
బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్స్ లేకపోవడంతో ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చిందో స్పష్టంగా తెలియడం లేదని.. బాండ్లతో ముడిపడిన అన్ని వివరాలను గతంలోనే స్పష్టం చేశామని.. అయినా ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.