ECI | పశ్చిమ బెంగాల్లో దాదాపు వెయ్యి మంది బూత్ స్థాయి అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంబంధిత సూచనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 కింద ఈ చర్యలు తీసుకుంది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సంబంధిత బీఎల్వోలో ఈఆర్వోనెట్ (ERO-Net) పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం, విధి నిర్వహణ ఉల్లంఘనకు సమానమని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950లోని సెక్షన్ 32ని ఉల్లంఘించడమేనని.. ఈ సెక్షన్ ప్రకారం ఎన్నికల పని కోసం నియమించబడిన అధికారులందరూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించడం తప్పనిసరని అధికారి పేర్కొన్నారు. ఎన్నికల డ్యూటీ సమయంలో బీఎల్వోలు భారత ఎన్నికల కమిషన్ (ECI)కి డిప్యుటేషన్లో ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, ఆదేశాలను పాటించనందుకు వారిపై క్రమశిక్షణా, శిక్షార్హమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా చెప్పాలరని బూత్ లెవల్ అధికారులను ఆదేశించింది. నిర్ణీత గడువులోపు స్పందించకపోతే సంబంధిత అధికారికి సరైన కారణం లేదని భావించాల్సి వస్తుందని.. శాఖాపరమైన నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని అధికారి తెలిపారు.