ముంబై: స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను (EVM) అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ నియోజక వర్గం ఫలితాలపై వివాదం తలెత్తింది. బీజేపీ అభ్యర్థి నారాయణ్ రాణే ఎన్నికను శివసేన (యూబీటీ) మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోర్టులో సవాల్ చేశారు. మోసపూరిత మార్గాల ద్వారా రాణే గెలిచారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించిన 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో గత ఆరేళ్లుగా జిల్లా ఎన్నికల అధికారి ఆధీనంలో అవి ఉన్నాయి.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి స్వాధీనంలో ఉన్న ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్ల కోసం బాంబే హైకోర్టును ఈసీ ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగం కోసం 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను రిలీజ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు పరిశీలించనున్నది.