Election Commission | న్యూఢిల్లీ:ఏఐ , డీప్ ఫేక్ టెక్నాలజీలతో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్(ఈసీ), ఈ అంశంపై తాజాగా ఆయా రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన కంటెంట్‌ను వాడటంలో ఆయా రాజకీయ పార్టీలు జవాబుదారీతనం, పారదర్శకత పాటించాలని ఈసీ పేర్కొన్నది.
ఏఐతో రూపొందించిన వీడియో, ఆడియో, ఫొటోలపై ‘ఏఐ జెనరేటెడ్ లేదా డిజిటల్లీ ఎన్హ్యాన్స్డ్ లేదా సింథటిక్ కంటెంట్’ అన్న లేబుల్‌ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా వాడాలని ఈసీ స్పష్టంచేసింది. ఫిబ్రవరి 5న జరుగుతున్న ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారాన్ని చేపట్టాయి. ఏఐ టెక్నాలజీతో రూపొందిన కంటెంట్‌తో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.