న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష పార్టీల నాయకులు తమ తుది ప్రయత్నాలు సాగించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సహా పలువురు నాయకులు ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొని.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఏప్రిల్ 9న ఒకే దశలో అస్సాం (126), కేరళ (140), పుదుచ్చేరి (30) ఎన్నికలు జరుగనున్నాయి. కేరళలో అధికార ఎల్డీఎఫ్ మూడోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నది. త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఓటమి తర్వాత వామపక్షాలకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించడానికి కాంగ్రెస్ ఆరు పార్టీలతో జతకట్టింది.
ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ‘సర్’ ; తక్కిన 22 రాష్ర్టాలు, యూటీల్లో నిర్వహణకు ఈసీ యోచన
న్యూఢిల్లీ: మూడో, తుది దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియను అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక సహా 17 రాష్ర్టాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) ఈ ప్రక్రియను ఈ నెల 29 నుంచి చేపట్టే అవకాశం ఉన్నది. సర్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈసీ అన్ని రాష్ర్టాలు, యూటీలకు సమాచారం అందించింది. ఇప్పటి వరకు 10 రాష్ర్టాల్లో సర్ పూర్తయ్యింది. అస్సాంలో వేరుగా ‘ప్రత్యేక సమీక్ష’ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో తప్ప మిగతా రాష్ర్టాల్లో సర్ తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఇప్పటి వరకు 60 కోట్ల మంది ఓటర్ల వివరాలను సర్‌లో పరిశీంచగా.. తుది దశలో 39 కో ట్ల ఓటర్ల వివరాలను సమీక్షించనున్నారు.