లక్నో : దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. పటేల్‌నగర్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అశోక్ జైడ్కా(72), మధు జైడ్కా(70) అనే దంపతులు పటేల్ నగర్లో నివాసముంటున్నారు. అయితే వీరి కూతురు నోయిడాలో నివాసం ఉంటోంది. పండుగ రోజున ఆమె తన తల్లిదండ్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో ఆమె ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. స్థానికులు వృద్ధ దంపతులు నివాసముంటున్న ఇంటికెళ్లి చూడగా, ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో పోలీసులకు వారు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దుండగులు దొంగిలించలేదు. కేవలం బట్టలు మాత్రమే చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుండగులు దోపిడీ కోసం రాలేదని, ఈ హత్య వెనుక ఇతర కారణాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించగా, మరొకరు బయట కాపలా ఉండి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.