లక్నో: స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. (Cricket Dispute Clash) దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి 16న సాస్ని గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీ పాడా ప్రాంతంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు వ్యక్తులైన అనాస్, మొహ్సిన్ మధ్య గొడవ జరిగింది. స్థానిక పెద్దల జోక్యంతో అది సద్దుమణిగింది.
కాగా, గురువారం రాత్రి ఈ వివాదంపై మళ్లీ ఘర్షణ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల వారు రూఫ్ పైనుంచి ఇటుకలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. కాల్పులు జరిపారు. కత్తిపోట్లలో పలువురు గాయపడ్డారు.
మరోవైపు ఘర్షణ గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపుచేశారు. ఇద్దరు మహిళలతో సహా గాయపడిన ఎనిమిది మంది వ్యక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు. తలకు తీవ్ర గాయాలైన ఐదుగురిని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.