మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?..రానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచన
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్‌సభలో ఇటీవల వీగిపోయిన ఈ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీయే సర్కార్ దృఢనిశ్చయంతో ఉన్నదా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
- రానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచన
- తమిళనాడు, బెంగాల్లో మారిన రాజకీయాలపై మోదీ సర్కార్ ఆశలు
- 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పునర్విభజన, జమిలి ఎన్నికల బిల్లులను ఆమోదింప చేసుకోవాలని కసరత్తు షురూ
- ఉభయ సభల్లో మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడానికి వ్యూహం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్‌సభలో ఇటీవల వీగిపోయిన ఈ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీయే సర్కార్ దృఢనిశ్చయంతో ఉన్నదా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంట్ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ఇప్పుడే ఎందుకు?
ఐదు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారిపోయాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పదిహేనేండ్ల పాలనకు గండికొట్టి పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదేసమయంలో ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన టీఎంసీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయగా, మరో 20 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు రెబల్స్‌గా మారారు. ఇటు తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం దిగిపోవడం, కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలను గ్రహించిన స్టాలిన్ పార్టీ ఇండియా కూటమి నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది.
గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆయా ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్-డీఎంకే కూటమి విచ్ఛిన్నమవ్వడంతో బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో టీఎంసీలో జరుగుతున్న పరిణామాలను కూడా కేంద్రం నిశితంగా గమనిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ, గణనీయ సంఖ్యలో ఎంపీలు టీఎంసీ నుంచి విడిపోతే అది పార్లమెంటరీ సమీకరణాలను మార్చివేసి బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతును కూడగట్టడంలో ప్రభుత్వానికి సాయం చేస్తుందని వాళ్లు అంచనా వేస్తున్నారు.
మ్యాజిక్ ఫిగర్ ఇలా..
నియోజకవర్గాల పునర్విభజన జరుగాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలుపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలుపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే.. 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. కానీ అధికార ఎన్డీయే కూటమికి ఉభయ సభల్లో ఇప్పుడు అంత బలం లేదు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 293 మంది (54%) సభ్యుల మద్దతు ఉండగా, రాజ్యసభలో ఎన్డీయేకు అనుకూలంగా 141 మంది (58%) సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.
ప్రయత్నాలు అందుకే..
గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు.. బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో సభలో 528 మంది సభ్యులు ఉన్నారు. అంటే కావాల్సిన మెజారిటీ 352. బిల్లుకు 298 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఫలితంగా అవసరమైన సంఖ్యాబలం దక్కకపోవడంతో సభలో ఆ బిల్లు వీగిపోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లోక్‌సభలోని ప్రతిపక్ష కూటమిలో మొన్నటివరకూ 233 మంది సభ్యులు ఉండేవారు. కానీ, కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలతో విసిగిపోయిన డీఎంకే.. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చింది. టీఎంసీలో రెబల్స్ వివాదం పెరిగిపోయింది. దీంతో టీఎంసీ (29 మంది ఎంపీలు), డీఎంకే (22 మంది ఎంపీలు) ఓటింగ్‌లో పాల్గొనకుండా గైర్హాజరైనా లేదా బిల్లుకు మద్దతు ప్రకటించినా డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో గట్టెక్కే అవకాశాలు మెరుగుపడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొన్నటి సంగతే విశ్లేషిస్తే, ఒకవేళ, టీఎంసీ, డీఎంకే ఎంపీలు బిల్లుకు మద్దతు ప్రకటించినట్లయితే, ఎన్డీయే బలం 298 నుంచి 349కు చేరుతుంది.
ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన ఆమ్ఆద్మీపార్టీ (లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు), కాంగ్రెస్‌తో దూరాన్ని పాటిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (లోక్‌సభలో 37 మంది ఎంపీలు) ఒకవేళ మద్దతు ప్రకటిస్తే సునాయాసంగా లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం లభించవచ్చు. ఇక, రాజ్యసభలో ఎన్డీయేకు అనుకూలంగా 141 మంది (58%) సభ్యులు ఉండగా, ప్రతిపక్షానికి 83 మంది ఎంపీల మద్దతు మొన్నటి వరకూ ఉండేది. ఎగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార కూటమికి 163 మంది సభ్యులు (మూడింట రెండు వంతుల మంది) కావాలి. అయితే, టీఎంసీకి రాజ్యసభలో ఉన్న 13 మంది ఎంపీల్లో ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడం, మిగిలిన ఎంపీలు కూడా అదే యోచనలో ఉండటం ఎన్డీయేలో కొత్త ఆశలు రేపుతున్నది. పైగా ఇండియా కూటమికి దూరమైన డీఎంకేకు రాజ్యసభలో 10 మంది ఎంపీలు, ఆప్‌నకు ముగ్గురు ఎంపీల మద్దతు ఉన్నది. ఈ లెక్కన వీళ్లు కూడా బిల్లుకు మద్దతు ప్రకటిస్తే, ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీయేకు ఉన్న బలం 141 నుంచి 163 మ్యాజిక్ ఫిగర్‌ను దాటే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కలను విశ్లేషించిన తర్వాతే.. డీలిమిటేషన్ బిల్లును పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

