గువాహటి, డిసెంబర్ 12: బీహార్‌లోని (Bihar) భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌లో అగువానీ-సుల్తాన్‌గంజ్ వద్ద గంగానదిపై నిర్మించిన వంతెన 2023 జూన్ 4న హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం (Assam) రాజధాని గువాహటిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం వెంటనే గువాహటి పట్టణంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న 8.4 కిలోమీటర్ల పొడవైన వంతెనపై దర్యాప్తునకు ఆదేశించింది. బీహార్‌లో కూలిపోయిన వంతెనకు, అస్సాంలో నిర్మాణంలో ఉన్న వంతెనకు మధ్య సంబంధం ఏమిటంటే ఈ రెండూ ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్ ఇండియా అనే ఓ కంపెనీకి చెందినవి. అస్సాంలో నిర్మాణంలో ఉన్న వంతెన నాణ్యతను సమీక్షించే బాధ్యతను ఐఐటీ-గువాహటికి అస్సాం ప్రభుత్వం అప్పగించింది. బీహార్ ప్రభుత్వం సైతం సంబంధిత కంపెనీకి నోటీసు జారీచేసింది. ఈ ఘటన జరిగి రెండేండ్ల్లు దాటినా అస్సాం ప్రభుత్వం ఆదేశించిన వంతెన నాణ్యతపై సమీక్షా నివేదిక వెలుగుచూడలేదు. అయితే ఘటన జరిగిన ఆర్థిక సంవత్సరంలోనే సదరు ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధికార బీజేపీకి (BJP) రూ. 5 కోట్ల విరాళమిచ్చినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ దర్యాప్తులో బయటపడింది.
సగానికి పైగా విరాళాలు కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచే
ఈశాన్య భారతంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకుని బీజేపీకి విరాళాలు అందచేసిన కన్స్ట్రక్షన్ కంపెనీల్లో కేవలం ఎస్పీఎస్ మాత్రమే లేదు. అలాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. 2022-24 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి నాలుగు ఈశాన్య రాష్ర్టాల నుంచి చెక్కులు, ఎలక్ట్రానిక్ బదిలీల రూపంలో రూ.77.63 కోట్ల విరాళాలను బీజేపీ వసూలుచేసింది. వీటిలో 54.89 శాతం విరాళాలు బీజేపీ ప్రభుత్వాలు లేదా కేంద్రం అధీనంలోని ఏజెన్సీల నుంచి టెండర్లు, రెగ్యులేటరీ ఆమోదాలు దక్కించుకున్న కంపెనీలు, వ్యక్తులు ఇచ్చినవే ఉండడం గమనార్హం.
అస్సాంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ సేకరించిన మొత్తం విరాళాలలో 52.34 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రాజకీయ విరాళాల్లో 64.48 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారి నుంచే ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ వసూలు చేసిన రూ. 20,000 పైబడిన విరాళాల్లో సగానికి పైగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలవే ఉండడం విశేషం. అదే ఏడాది త్రిపురలో బీజేపీకి లభించిన విరాళాల్లో 61.7 శాతానికి పైగా విరాళాలు ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి వచ్చినవే. అంతకుముందు ఏడాది ఇది 84.12 శాతం ఉండడం గమనార్హం. ఇక మణిపూర్ విషయానికి వస్తే 2022-23లో బీజేపీ సేకరించిన విరాళాల్లో 5 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి వసూలు చేసినవి ఉన్నాయి. 2023 మే 8న మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో బీజేపీ విరాళాల సేకరణ కూడా కుంటుపడింది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ కేవలం రూ. 29.8 లక్షల విరాళాలు మాత్రమే సేకరించగలిగింది. ఆ ఏడాది ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎవరూ బీజేపీకి విరాళాలు ఇవ్వకపోవడం విశేషం.