ముంబై : మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఇటీవల బాంబే హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మనీలాండింగ్ కేసులో మాజీ మంత్రికి కోర్టు ఈ నెల 4న బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్‌ను ఇచ్చింది. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎప్పుడు సమన్లు పంపినా వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది.
అయితే, బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో ఈడీ.. మహారాష్ట్ర మాజీ మంత్రిని గతేడాది నవంబర్‌లో అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై దోపిడీ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ముంబైలోని వివిధ బార్లు, రెస్టారెంట్ల నుంచి సుమారు 4.7 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించింది.
అక్రమంగా సంపాదించిన సొత్తును ఆయన కుటుంబం ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో ఉన్న ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కు బదలాయించినట్లు ఆరోపించింది. అలాగే మాజీ పోలీస్ కమిషన్ పరంబీర్ సింగ్ సైతం మాజీ హోంమంత్రిపై ఆరోపణలు గుప్పించారు. బార్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలంటూ టార్గెట్ ఇచ్చారని ఆరోపించగా.. ఆ ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.