చెన్నై, జూలై 17: ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముది ఇంటిపై సోమవారం దాడులు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రితో పాటు అతని కుమారుడు, ఎంపీ గౌతమ్ సిగమణి ఇంట్లో తనిఖీలు చేసింది. చెన్నై, విల్లుపురంలోని వారి ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో మైనింగ్ శాఖ మంత్రి గా ఉన్న పొన్ముది నిబంధనలు ఉల్లంఘించి తన కుటుంబ సభ్యుల పేరిట లైసెన్స్‌లు జారీ చేసి రాష్ట్ర ఖజానాకు రూ.28 కోట్ల నష్టం కలిగించారని ఈడీ ఆరోపించింది.
బీజేపీ స్క్రిప్ట్‌లో భాగంగానే…
ఈడీ దాడులను అధికార డీఎంకే, ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రతిపక్ష నాయకులపై బీజేపీ సర్కార్ దాడులు చేయిస్తున్నదని ఆరోపించాయి. బెంగళూరులో జరుగుతున్న విపక్ష పార్టీల సమావేశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈడీ సోదాలు జరిగాయని డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ కేసును పొన్ముది చట్ట ప్రకారం ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు. ఈడీ ద్వారా విపక్షాలను భయపెట్టి, పార్టీల ఐక్యతను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తున్నదని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈడీ కారణంగా ఎన్డీఏ మిత్రపక్షాలు ఆ పార్టీని వీడుతున్నాయని తెలిపారు. ఈడీతో ఎవరినీ భయపెట్టలేరని, నియంత్రించలేరని ఆయన పేర్కొన్నారు. బీజేపీ స్క్రిప్ట్‌లో భాగంగా ప్రతిపక్షాలను భయపెట్టి, విభజించేందుకు దాడులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.