రాంచీ : జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ప్రాంతాల్లో మరోసారి దాడులు నిర్వహించింది. రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తికి చెందిన బిహార్, జార్ఖండ్‌లోని పలు కార్యాలయాలు, ఇండ్లపై ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. బుధవారం తెల్లవారు జామున నుంచి రెండురాష్ట్రాల్లోని దాదాపు 17చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రేమ్ ప్రకాశ్‌కు రాజకీయ నాయకులతో గట్టి సంబంధాలున్నాయి. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈడీ జూలై 8న సాహెబ్‌గంజ్, బర్హయిత్, రాజ్‌మహల్, మీర్జాపోస్ట్లలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సన్నిహితుడైన పంకజ్ మిశ్రాతో పాటు అతని సహచరులకు సంబంధించిన 19చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత పంకజ్ మిశ్రాను ఈడీ విచారణకు పిలిచింది. ఆయన అనారోగ్య కారణాలు చెప్పి విచారణకు గైర్హాజరవడంతో.. మనీలాండరింగ్ కేసులో జూలై 19న ఈడీ మిశ్రాను అరెస్టు చేసింది.