న్యూఢిల్లీ, మే 9: కొత్తగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరా, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ శనివారం దాడులు నిర్వహించింది. దాడుల తర్వాత మంత్రిని అరెస్ట్ చేసింది. దీంతో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వానికి మధ్య రాజకీయ వివాదం తీవ్రతరమైంది. చండీగఢ్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు సోదాలు ప్రారంభించాయి. చండీగఢ్‌తోపాటు ఢిల్లీలోని రెండు ప్రదేశాలు, గురుగ్రామ్ ఉద్యోగ్ విహార్‌లోని హాంప్టన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. రూ.400 కోట్లకు పైగా విలువైన మొబైల్ ఫోన్ల నకిలీ జీఎస్టీ కొనుగోళ్లు, తదనంతర ఎగుమతులకు సంబంధించి ఈ దర్యాప్తు జరుగుతున్నది.
ఈ ఎగుమతులను దుబాయ్ నుండి భారత్‌దేశానికి అక్రమ నిధులను తరలించడానికి ఉపయోగించారని ఈడీ ఆరోపిస్తున్నది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) కింద ఏప్రిల్ 17న అరోరా, అనుబంధ సంస్థలపై ఈడీ సోదాలు నిర్వహించిన నెల రోజుల లోపే ఈ తాజా దాడులు జరిగాయి. దర్యాప్తులో భాగంగా నకిలీ అమ్మకాలు, ఎగుమతుల ఆరోపణలపై హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్, అరోరా, సంబంధిత సంస్థలకు చెందిన రూ.157.12 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.
కాగా, పంజాబ్ ఆప్ మంత్రి సంజీవ్ అరోరాపై ఈడీ దాడులను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్‌పై ఇటీవల జరిగిన ఈడీ దాడులను కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ ఈ దాడుల తర్వాత మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ సభ్యులతో కలసి మిట్టల్ బీజేపీలో చేరారని గుర్తు చేశారు. అరోరా బీజేపీలో చేరకపోవడంతో ఆయనపై మరోసారి ఈడీ దాడి జరిగిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా పంజాబ్‌లో ఈడీ తన చర్యలను ముమ్మరం చేసింది. అయితే, ఈడీ తనపై చేస్తున్న ఆరోపణలను అమన్ అరోరా కల్పిత కథలుగా కొట్టివేశారు. పంజాబ్‌లో ఈడీ చర్యలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వరాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆప్ వాదిస్తున్నది.