జలంధర్: డాంకీ రూట్ కేసు(Donkey Route Case)తో లింకున్న వారిపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టారు. మనీల్యాండరింగ్ కోణంలో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. అక్రమ రీతిలో అమెరికాకు వెళ్లిన వారిని .. తిరిగి ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో వందల సంఖ్యలో పంజాబ్, హర్యానాకు చెందిన వారిని అమెరికా నుంచి గెంటివేశారు. చేతులకు బేడీలు వేసి మరీ వాళ్లను ఇండియాకు తీసుకొచ్చారు. అక్రమ ఇమ్మిగ్రేషన్‌తో సంబంధం ఉన్న నిందితుల ఆఫీసులు, ఇండ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అమృత్సర్, సంగ్రూర్, పాటియాలా, మోగా, అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్ నగరాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
పంజాబ్, హర్యానాలో డాంకీ రూట్‌పై 17 కేసుల నమోదు అయ్యాయి. వాటితో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ తనిఖీలు చేపడుతున్నారు. ట్రావెల్ ఏజెంట్లు, మధ్యవర్తులపై ఆ కేసులు బుక్ చేశారు. అమెరికాకు వెళ్లాలనుకునేవారిని అక్రమ రీతిలో ఆ ఏజెంట్లు తీసుకెళ్లారు. ఒక దేశం నుంచి మరో దేశానికి, అక్కడ నుంచి దొంగ దారిలో అమెరికా తీసుకెళ్లారు. దీన్నే డాంకీ రూట్ అని సంబోధిస్తున్నారు. అయితే అక్రమ రీతిలో అమెరికా చేరిన వందలాది మంది భారతీయుల్ని ఫిబ్రవరిలో మళ్లీ ఇండియాకు చేర్చిన విషయం తెలిసిందే.
డాంకీ రూట్ కేసులో కొందరు అనుమానితుల పేర్లు బయటపడ్డాయి. వారి ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విదేశాలకు వెళ్లాలనుకున్న అమాయక వ్యక్తులను మోసం చేసినట్లు నిర్ధారించారు. సక్రమమైన రీతిలో అమెరికాకు పంపిస్తామని చెప్పి, తప్పుడు పద్ధతుల్లో వాళ్లును పంపించేవారు. ఒక్కొక్క అభ్యర్థి వద్ద సుమారు 50 లక్షలు ఛార్జ్ చేసేవాళ్లు. డొంకర్లు, మాఫియా ఆధారంతో అనేక మందిని బోర్డర్లు దాటించేవారు.